PS Telugu News
Epaper

“ఆఫర్ అంటూ నమ్మించాలనగా… ఒక్క క్షణంలో అసలు రంగు బయటపడింది!”

📅 21 Nov 2025 ⏱️ 11:35 AM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరి, బంగారం ధరలు చుక్కలనంటుతోంది.బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. బంగారం ధరలు మండిపోతున్న వేళ.. సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే, కేటుగాళ్లకు మాత్రం మంచి అవకాశంగా మారింది. అసలు బంగారాన్ని చూపి.. నకిలీది అంటగట్టి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు మోసగాళ్లు. ఈ కేటుగాళ్లు ఎలా మస్కా కొడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా హురులికలుకు చెందిన గోవిందప్ప జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీ మనీ కోసం ప్లాన్ వేశాడు. ఇందుకోసం మహేశ్, లోహిత్, నాగప్ప, ప్రసన్న గంగప్పలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అమాయకులే టార్గెట్ గా.. వారి వివరాలను తెలుసుకొని పరిచయం పెంచుకుంటారు. బంగారం ధర మండుతున్న వేళ.. అసలు బంగారాన్ని చూపి..తక్కువ ధరకు ఇస్తామని నమ్మించి నకిలీ బంగారంతో మోసం చేస్తున్నారు.జగిత్యాలకు చెందిన కారపు శ్యామసుందర్, అతని స్నేహితుడుతో కలిసి ఓ పనికోసం ఈ ఏడాది మే నెలలో ఏపీలోని పిడుగురాళ్లకు వచ్చారు. తిరిగి కోరుట్లకు వెళ్తూ మార్గ మధ్యలో మిర్యాలగూడలోని దాబా వద్ద ఆగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గోవిందప్ప.. శ్యాంసుందర్ తో మాట మాట కలిపి పరిచయం పెంచుకున్నాడు. తాను లారీ డ్రైవర్‌గా గతంలో కోరుట్లలో పనిచేశానని చెబుతూ శ్యాంసుందర్ ఫోన్ నెంబర్ ను అడిగి తీసుకున్నాడు. వారం రోజుల తర్వాత తనకు లంకె బిందెల్లో బంగారు నాణేలు దొరికాయని వాటిని తక్కువ ధరకు ఇస్తానని గోవిందప్ప ఫోన్ చేసి శ్యాంసుందర్ కు చెప్పాడు. బంగారు నాణేలు పరీక్షించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని నమ్మించాడు.కర్ణాటకలోని హోస్పేట దగ్గర బనికల్‌కు శ్యాంసుందర్ ను పిలిపించి నమూనాగా నకిలీ నాణేల కుండలో నుంచి రెండు అసలైన బంగారు నాణేలు ఇచ్చాడు. బంగారు నాణేలను శ్యాంసుందర్ కోరుట్లలో పరీక్షించగా, అవి అసలైన బంగారంగా తేలడంతో మిగిలిన బంగారు నాణేలను కొనుగోలు చేసేందుకు బనికల్ కు రావాలని గోవిందప్ప సూచించాడు. అయితే తాను అంతదూరం రాలేనని శ్యాంసుందర్ చెప్పడంతో గతంలో తాము కలిసిన మిర్యాలగూడలోని డాబా వచ్చి డబ్బులు ఇచ్చి బంగారం తీసుకెళ్లాని గోవిందప్ప చెప్పాడు. దీంతో మే మూడో వారంలో మిర్యాలగూడ దాబాలో కలిసిన గోవిందప్ప ముఠా నకిలీ బంగారు నాణేల లంకె బిందెను శ్యాంసుందర్ కు ఇచ్చాడు. లంకె బిందెలోనీ బంగారు నాణేలను పరీక్షించి తీసుకుంటానని శ్యాంసుందర్ చెప్పాడు. దీంతో పోలీసులు వస్తారని, ఇతరులు ఎవరైనా చూస్తున్నారని హడావుడి చేసి,12లక్షల రూపాయలను తీసుకొని కారులో పరారయ్యారు.లంక బిందెలోనీ నాణేలను పరిశీలించగా నకిలీ అని తేలింది. దీంతో మోసపోయానని గ్రహించిన శ్యాంసుందర్ మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అద్దంకి నార్కెట్‌పల్లి హైవేపై వాహనాల తనిఖీ చేస్తుండగా కర్నాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారులో అనుమానాస్పదంగా కనిపించింది. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. గోవిందప్ప నేరాన్ని అంగీకరించాడని మిర్యాలగూడ డిఎస్‌పీ రాజశేఖర్ రాజు తెలిపారు. నిందితుడు నుండి రూ. 5లక్షల నగదు, 200గ్రాములు అచ్చుపోసిన నకిలీ బంగారు నాణేలు, కారు, ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు.

Scroll to Top