PS Telugu News
Epaper

“ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తు: జమ్మూ–కశ్మీర్‌లో కొత్త సమాచారంతో విచారణ వేగం”

📅 21 Nov 2025 ⏱️ 11:47 AM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీ కారు పేలుడు ఘటనతో దేశ వ్యాప్తంగా ఉగ్రవేట కొనసాగుతోంది. శ్రీనగర్‌, జమ్మూ ప్రాంతాల్లో నలుగురు ప్రధాన అనుమానితులను NIA అరెస్ట్‌ చేసింది. అదేసమయంలో.. జమ్మూ కశ్మీర్‌లోని కశ్మీర్‌ టైమ్స్‌ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. నవంబర్‌ 10న జరిగిన ఢిల్లీ కారు పేలుడు ఘటనతో NIA అధికారులు దేశ వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఉగ్ర లింకుల ఆధారంగా ఎక్కడికక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. మరో నలుగురు ప్రధాన అనుమానితులను NIA అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య ఆరుకు చేరింది. వీళ్లందర్నీ శ్రీనగర్‌, జమ్ములో అదుపులోకి తీసుకోగా.. అక్కడి నుంచి తీసుకొచ్చి ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. కస్టడీకి అప్పగించడంతో NIA ప్రధాన కార్యాలయానికి తరలించారు. మరోవైపు.. జమ్మూకశ్మీర్‌ పోలీసు విభాగానికి చెందిన స్టేట్‌ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జరిపిన సోదాల్లో జమ్మూలోని కశ్మీర్ టైమ్స్ ఆఫీసులో ఏకే-47 బుల్లెట్లు దొరికినట్లు పోలీసులు వెల్లడించడం సంచలనం సృష్టించింది. క్యాట్రిడ్జ్‌లు, పిస్టల్‌ రౌండ్స్‌, మూడు గ్రనేడ్‌ లెవర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిన్న ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనూరాధ భాసిన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.భారతదేశం, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని ఆమె వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతోనే సోదాలు చేసినట్లు చెప్పారు. ఆమె కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమన్నారు. ఇక.. కశ్మీర్‌ టైమ్స్‌.. జమ్మూకశ్మీర్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక కాగా.. ఆ సంస్థలో సోదాలపై కశ్మీర్ టైమ్స్ సీనియర్ ఎడిటర్లు ఫైర్‌ అయ్యారు. తమను బెదిరించేందుకు, గళాన్ని అణచివేసేందుకే జమ్మూ పోలీసులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Scroll to Top