PS Telugu News
Epaper

అయ్యో కొడుకా… నా కడుపున ఎందుకు పుట్టావురా!

📅 21 Nov 2025 ⏱️ 2:42 PM 📝 క్రైమ్-న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మహబూబ్‌నగర్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన దివ్యాంగుడైన కుమారుడికి అంత్యక్రియలు కూడా చేయలేని దుస్థితిలో ఉన్న ఓ తండ్రి ఆవేదన అందరినీ కన్నీరు పెట్టించింది. చేతిలో చిల్లిగవ్వ లేక.. కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని స్మశానంలో నిస్సహాయంగా కూర్చుని కన్నీరు పెట్టుకున్న ఆ తండ్రి.. తనలాంటి వారి కడుపున ఏ బిడ్డా పుట్టకూడదంటూ విలపించాడు. తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఆ తండ్రి రోదించిన తీరుకు అక్కడున్న వారంతా కదిలిపోయారు. మహబూబ్‌నగర్‌ లోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో బాల‌రాజ్ అనే వ్య‌క్తి త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లతో క‌లిసి జీవ‌నం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ప‌త్తి మిల్లులో బాల‌రాజ్ ప‌ని చేసేవాడు. ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో బాల్‌రాజ్‌కు పనిలేకుండా పోయింది. దీంతో, బాల్ రాజ్ భార్య.. దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని ఇంట్లోనే ఉన్న భర్త వద్ద వదిలేసి.. చిన్న కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో బాలరాజ్ స్థానిక హోటల్లో పని చేస్తూ వికలాంగుడైన పెద్ద కుమారుడు హరీష్‌ను పోషిస్తున్నాడు. తల్లి వెళ్లిపోయిన నాటి నుంచి హరీష్ అనారోగ్యం పాలయ్యాడు. కానీ, చేతిలో చిల్లిగవ్వ లేని కారణంగా బాలరాజ్‌ కుమారునికి వైద్యం చేయించలేకపోయాడు. దీంతో ఇటీవల హరీష్‌ తీవ్ర అనారోగ్యానికి గురై చ‌నిపోయాడు. అంత్యక్రియలు చేసేందుకు డబ్బు లేక… ఏం చేయాలో తోచక.. బాలరాజ్‌ కుమారుడి మృతదేహాన్ని భుజం మీద వేసుకుని స్మశానానికి తీసుకుపోయాడు. అక్కడ ఒక్కడే కూర్చొని.. తన కొడుకు మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని 8 గంటలపాటు ఏడుస్తూ కూర్చుండిపోయాడు. ‘బ‌తికుండగా తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక నిన్ను మట్టి చేయలేకపోతున్నా’ అని కన్నీరు పెట్టుకున్నాడు. బాలరాజ్‌ పరిస్థితిని గమనించిన We are Foundation కి చెందిన వారు అంత్యక్రియలు పూర్తి చేయడానికి సహకరించారు.

Scroll to Top