PS Telugu News
Epaper

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయం రానుంది వారంలో షెడ్యూల్..!

📅 21 Nov 2025 ⏱️ 3:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు దశల్లో నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రణాళికలు రూపొందించింది.డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 20లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎలక్షన్ కమిషన్ తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా, ఎటువంటి లోపాలు లేకుండా చేపట్టాలని కలెక్టర్లకు ఈ సందర్భంగా కఠిన సూచనలు జారీ చేసింది.ఇటీవలే కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ఈ వారోత్సవాల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి.నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక..గతంలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రిజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీలు లేదంటూ హైకోర్టు వాటిని కొట్టేసింది. హైకోర్టు నిర్ణయంతో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. మరోవైపు ఈ నెల 24లోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవడం గమనార్హం.

Scroll to Top