PS Telugu News
Epaper

“భారత్-ఒమన్ మధ్య సత్సంబంధాల స్ఫూర్తి: వాణిజ్య రంగానికి కొత్త వెలుగు”

📅 21 Nov 2025 ⏱️ 3:09 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :భారత్, ఒమన్ మధ్య సత్సంబంధాలు నెలకొని సరిగ్గా 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఒమన్ జాతీయ దినోత్సవాలు నిర్వహించారు.  ఈ ఒమన్ జాతీయ దినోత్సవాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  ఒమన్ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు సంస్కృతి, సంప్రదాయాల కలయిక, వ్యక్తిగత సంబంధాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. అందుకే ఇరు దేశాలస్నేహం చిరకాలం పదిలంగా ఉందన్నారు.2023 నవంబర్‌లో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ భారత్ సందర్శనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో ఇరు దేశాలకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే ఇండియా-ఒమన్ విజన్ డాక్యుమెంట్ కూడా విడుదల చేశారన్నారు. అదే ఇప్పుడు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందన్నారు.రక్షణ రంగం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మకమైన భాగస్వామ్యం కొనసాగుతోందన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా మరింత మెరుగయ్యాయని, గత నాలుగేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపుపై 10.6 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ఇరు దేశాలకు సంబంధించిన అనేక జాయింట్ వెంచర్లు ఒమన్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుండడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఎన్నో సారూపత్యలు ఉన్నాయన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తుండగా.. ఒమన్ విజన్ 2040 కూడా లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతోందన్నారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక బంధాలు కూడా మెరుగ్గా ఉన్నాయని, ఈ ఏడాది భారత్ ఒమన్ మధ్య సత్సంబంధాలు మొదలై 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా భారత్‌కు చెందిన ఐఎన్ఎస్వీ కౌండిన్య నౌక తొలిసారిగా ఒమన్‌కు వెళ్లిరానుందన్నారు.ఒమన్‌లో భారత సంతతికి చెందిన పౌరులు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతున్నారన్నారు. భారత ఔన్నత్యాన్ని పెంచుతూ భారతీయుల ప్రతిభ చాటిచెబుతూ ఒమన్ అభివృద్ధిలో వారు కూడా భాగమవుతున్న వారికి అభినందనలు తెలిపారు. వారందరికీ అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.  ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అందిస్తూ, వారిపై ప్రేమ, అనురాగాలు కురిపిస్తున్న సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు భవిష్యత్తులో మరింతగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Scroll to Top