సీఎం చంద్రబాబు సీరియస్! జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం సమీపంలో!
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే జిల్లాల పునర్విజనపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రివర్గ సబ్ కమిటీ హాజరుకానుంది.ఇందులో భాగంగానే, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రజల అభ్యంతరాలను మంత్రులు సేకరించనున్నారు. అదే విధంగా మంత్రుల కమిటీ ప్రతిపాదనపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ప్రభుత్వం చురుకుగా కసరత్తు చేస్తోంది. క్యాబినెట్ సబ్ కమిటీ అంశంపై లోతైన అధ్యయనం చేయడానికి ఏడుగురు మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి వచ్చిన వినతులు, సూచనలను పరిశీలించింది. వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల విభజనలో తలెత్తిన లోపాలను సరిదిద్దడం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, పరిపాలనా సౌలభ్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మంత్రివర్గ సబ్ కమిటీ సీఎంకి అందించే నివేదికలో కొత్తగా మరో రెండు లేదా నాలుగు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇందులో మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా, మదనపల్లె కేంద్రంగా ఒక జిల్లా, అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలతో ఒక జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 31లోగా జనగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి, మంత్రివర్గ సబ్ కమిటీ తమ నివేదికను రూపొందించే పనిలో ఉంది. అధికారులు అంతర్గతంగా లేదా సబ్ కమిటీ సభ్యులు అనధికారికంగా సమావేశంలో చర్చించారు.