స్నేహితులతో వెళ్లిన చివరి పర్యటనే ప్రాణాంతకం… కుటుంబంలో శోకం
పయనించే సూర్యుడు న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లి వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి గుమ్మళ్ళ యశ్వంత్(15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. మనవడిపై గారాబం పెంచుకున్న నాయనమ్మ మనవడి మృతదేహం చూసి రోదిస్తూ గుండెపోటుతో చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. అశ్వారావుపేటకు చెందిన ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు ఆంధ్రా సరిహద్దుల్లోని సంగమం వాగు వద్దకు వెళ్లారు. వాగు వద్ద ఆటలు ఆడుతూ అందరూ వాగులోకి స్నానానికి దిగగా.. ఇద్దరు బాలురు మునిగిపోయారు. వాగు లోతు అంచనా వేయకుండా వీరు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో ఇద్దరూ మునిగిపోయారు. ఒక బాలుడు సురక్షితంగా బయటపడగా.. గుమ్మళ్ళ యశ్వంత్ అనే బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు వచ్చి వాగులో గాలించగా యశ్వంత్ మృతదేహం లభించింది. మృతి చెందిన యశ్వంత్ అశ్వారావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో పదవతరగతి చదువుతుండగా, ఆదివారం పిక్‌నిక్ అని వెళ్ళిన తమ కుమారుడు జీవచ్చవంగా ఇంటికి చేరడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో గాారాబంగా చూసుకున్న తన మనవడి మృతదేహాన్ని చూసి రోదిస్తూ నాయనమ్మ ఎంకులమ్మ(65) ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.