PS Telugu News
Epaper

మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది: ఆయుధాలు వీడతాం, అవసరమైన పని చేయాలి

📅 24 Nov 2025 ⏱️ 3:03 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ విడుదల చేసింది. తాము ఇకనుంచి ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మూడు రాష్ట్రాలైన  మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎంలకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ కమిటీ జోన్ ప్రతినిధి అనంత్ ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి జయ్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌లకు రాస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధిగా కొంత సమయం ఇస్తే.. ఆయుధాలు వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు  అభ్యర్థనను జారీ చేస్తున్నట్లు అనంత్ తెలిపారు. ఈ ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే 2026 ఫిబ్రవరి 15 వరకు తమకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం దేశంతో పాటు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీసీఎం సతీష్ దాదా తర్వాత, మరొక సీసీఎం కామ్రేడ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం ఆయుధాలను విడిచి ప్రభుత్వ పునరావాసం, నూతన మార్గం ప్రణాళికను అంగీకరించనున్నట్లు తెలిపారు. అయితే, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామన్నారు. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్నందున, మేము సమిష్టిగా ఈ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈ విషయంపై నమ్మాలని, ఇంత సమయం అడగడం వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదన్నారు. ఒకరితో ఒకరు త్వరగా సంభాషించుకునేందుకు వేరే సులభమైన మార్గాలు లేవన్నారు. ఇందుకోసం చాలా సమయం పడుతుందన్నారు. మావోయిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విధించిన గడువు 2026 మార్చి 31వరకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని కోరారు.

Scroll to Top