15 ఏళ్ల క్రితం కన్నీరు పెట్టించిన సంఘటన.. మళ్లీ తెరపైకి నాగవైష్ణవి పేరుతో
పయనించే సూర్యుడు న్యూస్ :15ఏళ్ల క్రితం జరిగిన ఘోరం….తెలుగు రాష్ట్రాలను కలవరపరిచిన నేరం. ఆస్తుల కోసం పదేళ్ల పాపను ఫర్నేస్‌లో వేసి కాల్చి బూడిద చేసిన దారుణం. విజయవాడలో కిడ్నాప్ చేసి గుంటూరులో కడతేర్చిన వైనం…అందరిని కంటతడి పెట్టించింది. ఆ నాగ వైష్ణవి సోదరుడు ఇప్పుడు తమకు రక్షణ కావాలంటున్నాడు? తమను కాపాడాలంటున్నాడు? అదే కథ, పాత పగ రిపీటవుతుందని భయపడుతున్నాడు.నాగ వైష్ణవి హత్య కేసులో.. ఇప్పుడు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన పంది వెంకట్రావుతో తమకు ప్రాణహాని ఉందన్న ఆమె సోదరుడి కంప్లయింట్‌తో, ఆ చిన్నారి హత్యోదంతం మళ్లీ తెర పైకి వచ్చింది. ఆనాడు జరిగిన ఘోరాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. విజయవాడకు చెందిన పలగాని ప్రభాకరరావు తన మేనకోడలిని వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టి చనిపోతుండటంతో దీనికి మేనరికమే కారణమని తెలుసుకున్నారు. దీంతో నిజామాబాద్‌కు చెందిన నర్మదాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, నాగవైష్ణవి అనే పాప కూడా ఉంది. నాగవైష్ణవి పుట్టాక ప్రభాకరావు వ్యాపారం వృద్ధి చెందింది. ఆ పాపపై ఆయన మమకారం పెంచుకున్నారు. అదే మొదటి భార్య కుటుంబంలో విభేదాలకు కారణమైంది. ప్రభాకరరావు మొదటి భార్య సోదరుడు పంది వెంకటరావు బావపై కక్షపెంచుకున్నాడు. ఆస్తి అంతా రెండో భార్య పిల్లల పేరున రాస్తారని అనుమానించాడు.