PS Telugu News
Epaper

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులు – లేటెస్ట్ వెదర్ అప్‌డేట్

📅 08 Nov 2025 ⏱️ 2:56 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మొంథా తుఫాన్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చెదురుమదురు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం నుండి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుంది. నిన్నటి దక్షిణ అంతర కర్ణాటక – పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర – ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్నవి.. శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో వెదర్ డిపార్ట్మెంట్ మరో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Scroll to Top