పాత వివాదాల నేపథ్యంలో ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకటాచలం పోలీసుల కథనం ప్రకారం, ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలోని పలుకూరువారిపాళెం గ్రామానికి చెందిన సంపత్ గత నెల 16న వినాయక నిమజ్జనం సందర్భంగా చరణ్‌పై దాడి చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై అదే గ్రామానికి చెందిన అంకయ్య.. సంపత్‌ను ప్రశ్నించాడు. దీంతో అంకయ్యపై సంపత్ కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని శేషు, అన్వేషి, రవికి చెప్పడంతో నలుగురూ కలిసి అంకయ్యపై దాడికి పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గత నెల 28న గ్రామ సమీపంలోని చెరువు వద్దకు అంకయ్యను పిలిపించిన నలుగురూ అతడిపై తీవ్రంగా దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా బీర్ బాటిళ్లతో చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెంకటాచలం సీఐ అంకమ్మ తెలిపారు. పాత గొడవలను మనసులో పెట్టుకుని దాడులకు దిగడం, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడటంపై ఈ ఘటన చర్చకు దారితీసింది.