ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇందిరా గాంధీ 42వ వర్ధంతి కార్యక్రమం
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరొందిన స్వర్గీయ ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయంలో ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పట్లోళ్ల నాగిరెడ్డి మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి, మహిళా సాధికారతకు ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణ కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వం, దేశం పట్ల చూపిన నిబద్ధత భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.భారతదేశ రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేక స్థానం ఉందని, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాచమల్ల శేఖర్ గౌడ్, అశోక్ ముదిరాజ్ తదితరులు పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.