ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి వంగవీటి రాధా కొత్త ప్రస్థానం… నూతన అధ్యాయం

జనసేనలోకి వంగవీటి రాధా కొత్త ప్రస్థానం… నూతన అధ్యాయం

పయనించే సూర్యుడు అక్టోబర్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనసేనలో చేరిన వంగవీటి రాధాకు ఘన స్వాగతం పలికిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకుడు కాట్రేనికోన మండలం చెయ్యారు త్వటపల్లి నాగభూషణం కాపు సామాజిక వర్గానికి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత నేత వంగవీటి మోహన రంగా వారసుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నాయకుడు వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన పట్ల ఆకర్షితులై ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వంగవీటి రాధా రాకతో జనసేన పార్టీకి మరింత బలం చేకూరిందని, కోస్తా జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా జనసేనలోకి విచ్చేసినందుకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకుడు త్వటపల్లి నాగభూషణం ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. కొత్త ప్రస్థానం… నూతన అధ్యాయం అంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి వంగవీటి రాధా నడవడం వల్ల కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, వంగవీటి రంగా ఆశయాలను పవన్ కళ్యాణ్ ద్వారానే సాధించగలమని నాగభూషణం పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ సాధన, యువతకు ఉపాధి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వంగవీటి రాధా తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని, ఆయనకు కాపు సమాజం అండగా ఉంటుందని తెలిపారు. వంగవీటి రాధాకు జనసేన పార్టీలో సముచిత గౌరవం, ఉన్నత స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS