పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కేసనపల్లి ఉన్నత పాఠశాల మరియు గూడపల్లి పల్లిపాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు వక్తృత్వ పోటీలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి,వారిలో ఆత్మవిశ్వాసం,వాక్చాతుర్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ అంశాలపై తమ ప్రసంగ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యతో పాటు ఇలాంటి పోటీలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహద పడతాయన్నారు. విద్యార్థి దశ నుంచే వేదికపై మాట్లాడే ధైర్యాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో ఏ రంగంలోనైనా రాణించవచ్చని,ప్రతి విద్యార్థి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలని కోరారు.కేసనపల్లి కార్యక్రమంలో అడబాల రాంబాబు,కాపిశెట్టి కనికేశ్వరరావు,పాఠశాల చైర్మన్ అడబాల ఏసుబాబు,గూడపల్లి పల్లిపాలెం కార్యక్రమంలో కాపిశెట్టి కనికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.