ఆంధ్రప్రదేశ్

తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ – బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి

తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ – బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి

పయనించే సూర్యుడు అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఢిల్లీలో ధర్నా వేదికగా ఎన్నికల సంఘం, ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మతోన్మాద శక్తులతో కలిసి రాహుల్ గాంధీ నిర్వహించిన ధర్నా ఫేక్ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందుంచకుండా తప్పుడు సమాచారం, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. తనను తాను లౌకికవాదానికి, రాజ్యాంగానికి రక్షకుడిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని, రాజ్యాంగ విలువల కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఫామ్-6లో మార్పులపై కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆధారాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు రేకెత్తించడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమని పేర్కొన్నారు. కట్టుకథలు సృష్టించడం రాహుల్ గాంధీకి రాజకీయ వ్యూహంగా మారిందని, హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ సిద్ధాంతాన్ని ఒంటబట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఈవిఎంలు హ్యాక్ అవుతున్నాయని చేసిన ఆరోపణలు నిలబడలేదని, ఇప్పుడు ఎన్నికల కమిషన్ పై చేస్తున్న ఆరోపణలు కూడా ఫేక్ అని తేలిపోయాయని, కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు అదే ఈవిఎంలపై ప్రశ్నలు లేకపోవడం డొల్లతనాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. ఓటమి ఎదురైనప్పుడు వ్యవస్థను తప్పుబట్టడం, గెలిచినప్పుడు అంగీకరించడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS