PS Telugu News
Epaper

ఏజెన్సీ గ్రామాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే సహించం

📅 31 Dec 2025 ⏱️ 3:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వలస వచ్చిన గిరిజనేతరులపై చర్యలకు డిమాండ్

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు మండల పరిధిలోని ఏజెన్సీ గిరిజన గ్రామాల హోదాను మార్చేందుకు కొందరు గిరిజనేతరులు చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొమరం భీమ్ ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, మండలంలోని ఏన్కూర్, నాచారం, ఆరికాయలపాడు, జన్నారం గ్రామాలను ఏజెన్సీ గ్రామాలు కావని చిత్రీకరించేందుకు కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

వలస వచ్చి.. హక్కులకు భంగం

కృష్ణా జిల్లా, ఇతర ప్రాంతాల నుండి ఉపాధి కోసం వలస వచ్చిన గారపాటి అశోక్, పొన్నం హరికృష్ణ, గుత్తా నాగేశ్వరరావు, ప్రతాపనేని రవి తదితరులు స్థానిక గిరిజన చట్టాలకు, భారత రాజ్యాంగ హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో బయటి వ్యక్తులు స్థిరపడటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19/5 ప్రకారం ఉల్లంఘన క్రిందకు వస్తుందని గుర్తుచేశారు.

చరిత్రను వక్రీకరిస్తున్నారు

1949 నాటి ఫసీలీ 1359 గెజిట్ నోటిఫికేషన్, 1954 ఫిబ్రవరి 2 నాటి నోటిఫికేషన్ ప్రకారం జన్నారం, నాచారం, ఆరికాయలపాడుతో సహా 33 గ్రామాలు పాల్వంచ తాలూకా పరిధిలోని ఏజెన్సీ గ్రామాలుగా స్పష్టంగా గుర్తించబడ్డాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం కొందరు తప్పుడు ఆధారాలతో 75 ఏళ్ల క్రితం నాటి గెజిట్‌ను సవాలు చేస్తూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల సుప్రీంకోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాకేష్ కుమార్ కేసులో, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరుల జోక్యం చెల్లదని స్పష్టం చేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు. గిరిజన గ్రామాల చరిత్రను వక్రీకరిస్తూ, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూసం సుధీర్ కుమార్, వర్సా రాంబాబు, వాసం శ్రీకాంత్, వర్షా నాగరాజు, లింగాల శ్రీకాంత్, బండ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top