భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌పై దాడిని ఖండిస్తూ అధ్యాపకుల నిరసన
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా, జూలై 8: భైంసా పట్టణంలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న దుర్ఘటనను అధ్యాపకులు, సీపీడీసీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య జూలై 7, 2026 మంగళవారం సాయంత్రం సుమారు 4:45 గంటలకు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తుండగా, ఒక విద్యార్థి కాపీ కొడుతున్నట్లు గుర్తించి అతని ఆన్సర్ బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ విద్యార్థి ఆగ్రహానికి లోనై ప్రిన్సిపాల్ చేతుల నుంచి ఆన్సర్ బుక్‌ను బలవంతంగా లాక్కొని చించి వేసి, అనంతరం ప్రిన్సిపాల్‌పై భౌతిక దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనను అడ్డుకునేందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లు, కళాశాల సిబ్బంది ప్రయత్నించగా వారిని కూడా తోసివేసి, సమీపంలోని గోడపై నుంచి దూకి పరారయ్యాడు.ఈ ఘటనపై కళాశాల అధ్యాపక బృందం, సీపీడీసీ అధ్యక్షులు డాక్టర్ నాగేష్ , జనరల్ సెక్రటరీ మనోజ్ తదితరుల ఆధ్వర్యంలో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులకు అందజేయగా, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం కళాశాలలో ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య ఆధ్వర్యంలో అధ్యాపకులు, సీపీడీసీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్న అధికారులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి, విద్యా వ్యవస్థకు ముప్పుగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ అధికారులు, విద్యాసంస్థల సిబ్బంది విధులు నిర్విఘ్నంగా నిర్వహించేలా ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.