కొత్త సంవత్సరానికి ముందస్తు కానుకగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పయనించే సూర్యుడు డిసెంబర్ 31, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పెన్షన్‌దారులకు జనవరి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను ఒక రోజు ముందుగానే, డిసెంబరు 31వ తేదీన పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని గోపాల్ నగర్‌లో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని, ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంజూరైన పెన్షన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని మొత్తం 2 లక్షల 16 వేల మంది పెన్షన్‌దారులకు రూ.92 కోట్ల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని డిసెంబరు 31వ తేదీననే విజయవంతంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఆర్థిక భద్రతతో జీవించేందుకు ఈ పెన్షన్ పథకం ఎంతగానో దోహదపడుతోందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా పి4 (ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమంలో భాగంగా నంద్యాల అర్బన్ పరిధిలోని గోపాల్ నగర్‌కు చెందిన మూరబోయిన రామతులసమ్మను దత్తత తీసుకొని, వారి సంక్షేమం, బాగోగులు పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ఉన్నత స్థాయి ప్రజలు కూడా ముందుకు వచ్చి “బంగారు కుటుంబాలకు” చేయూతనిచ్చి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ జిల్లా వాసులకు జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గోపాల్ నగర్‌కు చెందిన మూరబోయిన రామతులసమ్మకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నాలుగు వేల రూపాయల మొత్తంతో పాటు, నూతన సంవత్సరం సందర్భంగా పండ్లు, మిఠాయిలు కిట్ మరియు మంచాన్ని, జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.