జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసాలో అడ్మిషన్ డ్రైవ్ సమీక్షా సమావేశం

June 12, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : భైంసా, జూన్ 12: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో జూన్ 6 నుండి 12 వరకు నిర్వహించిన అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమంపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ మాట్లాడుతూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను చేరవేయడమే లక్ష్యంగా అడ్మిషన్ డ్రైవ్‌ను నిర్వహించినట్లు తెలిపారు. అడ్మిషన్ల పెంపు కోసం అధ్యాపక బృందాలు వివిధ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్నత విద్య ప్రాధాన్యత, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాలపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అలాగే కరపత్రాల పంపిణీ, పోస్టర్ల ప్రదర్శన, సోషల్ మీడియా ప్రచారం, గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు.అడ్మిషన్ ఇన్‌చార్జ్ డా. జె. భీమారావు మాట్లాడుతూ, కళాశాలలో అందుబాటులో ఉన్న డిగ్రీ కోర్సులు, ఉపకార వేతనాలు, మౌలిక వసతులు మరియు ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేపట్టినట్లు వివరించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. యు. రవికుమార్ కళాశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.ఈ సమీక్షా సమావేశంలో సీనియర్ అధ్యాపకులు డా. ఎం. శంకర్, డా. ఆర్. రాజు, డా. ఓం ప్రకాష్, డా. సంతోష్, డా. కల్పన, డా. నాహేదా, సురేందర్, దివ్య, శ్రావణ్య, ముత్యం తదితరులు పాల్గొని ప్రచార కార్యక్రమాల ఫలితాలు, అడ్మిషన్ల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.ఈ సందర్భంగా జూన్ 15న కళాశాలలో ఎం.ఏ. ఇంగ్లీష్ మరియు ఎం.కామ్ పీజీ కోర్సులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని కోర్సుల వివరాలు తెలుసుకోవాలని సూచించారు.కళాశాలలో డిగ్రీ ప్రవేశాలు కొనసాగుతున్నందున అర్హులైన విద్యార్థులు వెంటనే అడ్మిషన్ పొందాలని కళాశాల ప్రిన్సిపాల్ కోరారు.

🌐 Select Language:
📰 ePaper