ఝరి బి గ్రామంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

August 9, 2026 | తెలంగాణ

ఆదివాసీ సంస్కృతి, హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:తానూర్, ఆగస్టు 9: నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి బి గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘం సభ్యుల అధ్యక్షతన, గ్రామంలోని అన్ని సంఘాలు, గ్రామస్తులు మరియు యువకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివాసీ సమాజం యొక్క ఐక్యతను చాటుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు.ముందుగా ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆదివాసీ సంఘం అధ్యక్షుడు గడ్డం గణేష్ ఆదివాసీ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, సంఘం సభ్యులు కొమురం భీమ్ ఆశయాలను స్మరించుకున్నారు.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాల్సిన అవసరంపై కార్యక్రమంలో చర్చించారు. ఆదివాసీ సమాజం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం సభ్యులు దొంతుల రమేష్ మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి గ్రామంలోని అన్ని సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీ సమాజం హక్కులు, అభివృద్ధి మరియు ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే ఝరి బి గ్రామంలో ఆదివాసీ సంఘం కోసం కమిటీ హాల్ నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తుల సహాయ సహకారాలు అందించాలని కోరారు. కమిటీ హాల్ నిర్మాణం పూర్తయితే ఆదివాసీ సంఘం సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు మరియు యువతకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు తమ వంతు సహకారం అందించి కమిటీ హాల్ నిర్మాణానికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు.ఆదివాసీ సమాజం తమ హక్కుల కోసం ఐక్యంగా ఉండడంతో పాటు, తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను భవిష్యత్ తరాలకు అందించాలని ఈ సందర్భంగా పలువురు సూచించారు. యువత కూడా ఆదివాసీ చరిత్ర, సంస్కృతి మరియు మహనీయుల ఆశయాలను తెలుసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం అధ్యక్షుడు గడ్డం గణేష్, సంఘం సభ్యులు దొంతుల , గ్రామస్తులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

🌐 Select Language:
📰 ePaper