తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న భైంసా అమరులను ప్రభుత్వం గుర్తించాలి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: – టీజేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ మార్వాడి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ భైంసా, జూలై 29:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న నిర్మల్ జిల్లా , భైంసా, ముధోల్ నియోజకవర్గాల అమరులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, వారికి ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందించాలని టీజేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ మార్వాడి మరియు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.నిర్మల్ జిల్లా మరియు ముధోల్ నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమ కాలంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల కుటుంబాలను గుర్తింపు కమిటీ మొదటి ప్రాధాన్యంతో గుర్తించి, ప్రభుత్వం ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న ఐదుగురు అమరులలో ఇద్దరికి మాత్రమే అప్పటి తెరాస ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించగా, మిగిలిన ముగ్గురికి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని వారు పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి, మిగిలిన అమరుల కుటుంబాలకు కూడా సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా, తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసు కేసులు నమోదైన ఉద్యమకారులు, బైండోవర్కు గురైన వారు, జేఏసీ ఆధ్వర్యంలో ముందుండి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి, వారికి కూడా తగిన గౌరవం, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి అమరుడికి సమాన గుర్తింపు, గౌరవం, ప్రభుత్వం ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది.ప్రభుత్వ సహాయం అందని అమరులు నాంపల్లి భాస్కర్ – సోనార్ గల్లి, భైంసా తోపాయి రవి – కొర్బగల్లి, భైంసా సల్లెందుల యోగేష్ – కొర్బగల్లి, భైంసా అప్పటి తెరాస ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించిన అమరులు పాపిన్వార్ శైలేందర్ – పురానా బజార్, భైంసా పద్దె గంగాధర్ – పిప్రి గ్రామం, లోకేశ్వరం మండలం ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రచయితల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు పుండలిక్ రావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కార్యదర్శి చాకేటి లక్ష్మన్న పాల్గొన్నారు.