బైంసా పట్టణంలోని గోపాల్ రావు డిగ్రీ కళాశాలలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

July 29, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భారతీయ సంస్కృతిలో గురువుకు దైవం కంటే ఉన్నతమైన స్థానం ఉందని చాటి చెప్పే పవిత్ర పర్వదినమైన గురుపౌర్ణమి సందర్భంగా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో హిందీ విభాగం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమాన్ని మహర్షి వేదవ్యాసుల చిత్రపటానికి పూలమాలలు వేసి, దీపప్రజ్వలనతో ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ మాట్లాడుతూ, గురుపౌర్ణమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, భారతీయ జ్ఞాన సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతం వంటి మహాగ్రంథాలను రచించిన మహర్షి వేదవ్యాసుడు ప్రపంచానికి అందించిన జ్ఞాన సంపద చిరస్మరణీయమని కొనియాడారు. అందుకే ఆయనను “జగద్గురు”గా ఆరాధిస్తూ ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున గురుపౌర్ణమిని జరుపుకుంటామని వివరించారు.హిందీ విభాగాధిపతి డా. పవన్ కుమార్ మాట్లాడుతూ, అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపేవారే గురువులని అన్నారు. విద్య అనేది పుస్తకాలలో మాత్రమే ఉండదని, మంచి వ్యక్తిత్వాన్ని, విలువలను, క్రమశిక్షణను, మానవత్వాన్ని నేర్పేది గురువేనని పేర్కొన్నారు. ప్రతి మనిషి విజయానికి వెనుక ఒక గొప్ప గురువు ఉంటాడని, గురువుల పట్ల గౌరవం, కృతజ్ఞత ప్రతి విద్యార్థి జీవితాంతం నిలుపుకోవాలని సూచించారు.అనంతరం డా. జె. భీమారావు మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి తొలి గురువులు తల్లిదండ్రులేనని, అనంతరం విద్యాబుద్ధులు నేర్పి జీవితానికి దిశానిర్దేశం చేసేవారు ఉపాధ్యాయుల ని తెలిపారు. గురువు ఆశీస్సులు, మార్గదర్శనం ఉన్నచోటే నిజమైన విజయం సాధ్యమవుతుందని అన్నారు.కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు గురుపౌర్ణమి విశిష్టత, గురు-శిష్య పరంపర గొప్పతనం, భారతీయ సంస్కృతిలో గురువుల స్థానం గురించి ప్రసంగించి సభను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ శంకర్, ఏ రాజు ,డాక్టర్ ఓం ప్రకాష్ ,డాక్టర్ సంతోష్ కుమార్ , డాక్టర్ నహీదా, డాక్టర్ కల్పన శ్రావణ్య ,డాక్టర్ సుధాకర్ రాజయ్య, ముత్యం ,సురేందర్, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని–విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురువుల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు.”గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః।గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥”ఈ శ్లోకం గురువు స్థానం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. మన జీవితాన్ని అజ్ఞానం నుండి జ్ఞాన మార్గంలో నడిపించి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రతి గురువుకూ గురుపౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం ఘన నివాళిగా నిలిచింది.

🌐 Select Language:
📰 ePaper