PS Telugu News
Epaper

నూతన సంవత్సర కానుకగా వసతి గృహ విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’: జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

📅 30 Dec 2025 ⏱️ 7:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 30,నంద్యాల జిల్లా,

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ‘ముస్తాబు కిట్లు’ అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్లను కలిసేందుకు వచ్చే జిల్లా అధికారులు ఎవరూ బొకేలు, కేకులు, శాలువలు తీసుకురావద్దని స్పష్టంగా ఆదేశించారు. వాటికి ప్రత్యామ్నాయంగా విద్యార్థుల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ‘ముస్తాబు కార్నర్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా జిల్లా సర్వోన్నత అధికారికి అందించే కానుకల స్థానంలో ‘ముస్తాబు కిట్లు’ అందజేసే విధంగా జిల్లా అధికారులు సహకరించాలని కోరారు. ఈ కిట్లలో అద్దం, దువ్వెన, నెయిల్ కట్టర్, హ్యాండ్‌వాష్, శానిటైజర్ వంటి అవసరమైన వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విధంగా సేకరించిన ముస్తాబు కిట్లను జిల్లాలోని వసతి గృహాల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా, 20 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు కర్మాగారాలు, పాఠశాలలు, ఆసుపత్రులు తదితర సంస్థలు తప్పనిసరిగా ఈపిఎఫ్ఓ (EPFO)లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. అలాగే సంబంధిత ఉద్యోగులు ప్రధానమంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRY) కింద నమోదు చేసుకోవడం ద్వారా ఉద్యోగ సంస్థలకు, ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్ రూపంలో ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Scroll to Top