ప్రజాసమస్యలు పట్టించుకోని MPDO కార్యాలయం? ఫైళ్ల కదలికకు ముడుపుల ఆరోపణలు

August 28, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు ఆగస్టు 28 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలో ప్రజాసమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలపై పలుమార్లు వినతులు సమర్పిస్తున్నప్పటికీ వాటిపై సకాలంలో స్పందన కనిపించడం లేదని పలువురు వాపోతున్నారు.ముఖ్యంగా EOPRD కార్యాలయంలో ఫైళ్లు ముందుకు కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తోందనే ఆరోపణలు గ్రామాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పరిపాలనా అంశాలపై అధికారులు స్పందించాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం MPDOను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో ఫోన్లకు స్పందించకపోవడం, ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరగడం వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ప్రజల నుంచి వస్తున్న ఈ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, MPDO మరియు EOPRD కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై ప్రత్యేక పరిశీలన నిర్వహించి, డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయాల్సినవే తప్ప, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితి ఉండకూడదని, సూళ్లూరుపేట మండలంలో పరిపాలన పారదర్శకంగా, జవాబుదారీతనంతో సాగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

🌐 Select Language:
📰 ePaper