బైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ & ఓరియంటేషన్ కార్యక్రమం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ & ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు కళాశాలలో అందుబాటులో ఉన్న అన్ని విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని స్వీకరించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ హాజరు శాతాన్ని పెంపొందించుకోవడంతో పాటు ప్రతి పాఠ్యాంశంలో ఎదురయ్యే సందేహాలను అధ్యాపకుల సహాయంతో నివృత్తి చేసుకోవాలని తెలిపారు.అంతేకాకుండా కళాశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం, గ్రంథాలయం, ఇంగ్లీష్ ల్యాబ్,( టీఎస్ కేసి) వంటి సదుపాయాలను వినియోగించుకొని పోటీ పరీక్షలకు సిద్ధమై తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ రాథోడ్ విజేష్ కుమార్ మాట్లాడుతూ, కళాశాలలోఉన్న మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల అంకితభావాన్ని ప్రశంసించారు. ఇటువంటి ఉత్తమ విద్యా వాతావరణంలో చదివే అవకాశం విద్యార్థులకు ఒక అదృష్టమని పేర్కొన్నారు. కళాశాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ముఖ్య అతిథిని ఘనంగా సన్మానించారు.కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ మరియు కోఆర్డినేటర్ డా. రవికుమార్ కళాశాలలో అమలవుతున్న వివిధ అకాడమిక్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించి, విద్యార్థుల సందేహాలకు సమాధానాలు అందించారు.కార్యక్రమంలో భాగంగా సీనియర్ విద్యార్థులు, నూతన విద్యార్థులు కలిసి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.