భగవద్గీతా ఫౌండేషన్ ను దర్శించిన చైతన్య గ్రూప్ అధినేత కె.వి.వి. సత్యనారాయణ రాజు

September 13, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 (గ్రంధి నానాజీ) అమలాపురంలోని ప్రసిద్ధ చైతన్య గ్రూప్, కిమ్స్ వైద్య కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) 9 సెప్టెంబర్ 2026న హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ గీతా కృష్ణ మందిరాన్ని కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్.వి. గంగాధర శాస్త్రి, చైతన్య రాజు దంపతులకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ గీతా ప్రచార కార్యక్రమాలను వారికి వివరించారు. ప్రస్తుతం తెలుగులో రూపుదిద్దుకుంటున్న సంగీతభరిత సంపూర్ణ భగవద్గీత కృత్రిమ మేధస్సు ప్రాజెక్టును వారికి ప్రదర్శించారు. భగవద్గీతలోని శ్లోకాలకు అనుగుణంగా రూపొందించిన కృత్రిమ మేధస్సు దృశ్యాలను చూసి చైతన్య రాజు అభినందించారు. ఈ ప్రాజెక్టులో సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న నేతాజీని ఆయన సత్కరించారు. ఈ ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా యూట్యూబ్ ద్వారా లోకార్పణం చేయనున్నట్లు గంగాధర శాస్త్రి తెలిపారు. భగవద్గీతా ప్రచార మహాయజ్ఞం గురించి తెలుసుకున్న చైతన్య రాజు స్పందిస్తూ, ఈ మహత్తర కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విద్యాసంస్థల ద్వారా అందిస్తున్న సేవలతో పాటు, తెలుగు మహాసభల నిర్వహణ వంటి కార్యక్రమాల ద్వారా భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు చైతన్య రాజు చేస్తున్న కృషిని గంగాధర శాస్త్రి కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు చలపతి రాజు, సీతాకాంత్, నేతాజీ తదితరులతో కలిసి చైతన్య రాజు దంపతులను ఘనంగా సత్కరించారు.

🌐 Select Language:
📰 ePaper