భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు భవిష్యత్తును కాపాడేది క్రమశిక్షణే – ర్యాగింగ్, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జూనియర్ సివిల్ జడ్జి ఆర్.కె. వెంకటరమణ సుహాస్

August 1, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసాలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) మరియు మండల న్యాయ సేవల కమిటీ (ఎంఎల్ఎస్ సి) సంయుక్త ఆధ్వర్యంలో క్యాలెండర్ కార్యకలాపాల సందర్భంగా “యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు ఎన్‌డీపీఎస్ చట్టం–1985” అంశాలపై శనివారం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ మాట్లాడుతూ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, చట్టాలపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు అందించిన మార్గదర్శకాలను కళాశాల విద్యార్థులు తప్పనిసరిగా ఆచరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన భైంసా జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఆర్.కె. వెంకటరమణ సుహాస్ మాట్లాడుతూ, ర్యాగింగ్ అనేది సరదా కాదు… అది చట్టరీత్యా శిక్షార్హమైన నేరం అని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాలు యువత జీవితాలను, కుటుంబాలను, సమాజ భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. ఎన్‌డీపీఎస్ చట్టం–1985లోని కఠిన నిబంధనలను వివరించి, ఒక్క తప్పు నిర్ణయం జీవితాంతం చెరగని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. ఉపనిషత్తుల సందేశమైన “సత్యం వద… ధర్మం చర… స్వాధ్యాయాన్మా ప్రమదః”ను ఉటంకిస్తూ, సత్యం, ధర్మం, క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం ప్రతి విద్యార్థి జీవితానికి బలమైన పునాదులు కావాలని సూచించారు.భైంసా సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలు, ర్యాగింగ్ వంటి సామాజిక దురాచారాలకు దూరంగా ఉండి చదువుపై ఏకాగ్రతతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సమాజానికి గర్వకారణంగా నిలవాలని కోరారు.న్యాయవాదులు ముత్తన్న మరియు షేక్ అంజద్ మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన కలిగిన యువతే సమాజ నిర్మాణంలో కీలక శక్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు “ర్యాగింగ్‌కు నో చెప్పండి – మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి – చట్టాన్ని గౌరవించండి – విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించండి” అనే సందేశాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. నహీదా, డా. జాదవ్ ఓంప్రకాష్, లు ఈ సందర్భంగా నాశముక్తభారత్ అంశంపై విద్యార్థులు అధ్యాపకులచే ప్రతిజ్ఞ చేయించారు ఆంటీ డ్రగ్స్ కోఆర్డినేటర్ డా. కె. సంతోష్ కుమార్, అధ్యాపకులు డా. భీమారావు, డా. రవికుమార్, డా. పవన్ కుమార్, డా. శంకర్, శ్రీ ఏ. రాజు, డా. సుధాకర్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో చట్టాల పట్ల అవగాహన, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, మానవీయ విలువలను పెంపొందించే దిశగా ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

🌐 Select Language:
📰 ePaper