*రాబోయే గోదావరి పుష్కరాల – 2027 విజయవంతమైన నిర్వహణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకుసాగాలి

పయనించే సూర్యుడుD.22.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.పోలీస్ కమిషనర్ వెల్లడి*నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో గోదావరిపుష్కరాలు – 2027 సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పుష్కర ఘాట్ల వద్ద చేపట్టాల్సిన భద్రతా చర్యలు , ట్రాఫిక్ నిర్వహణ , పార్కింగ్ ఏర్పాట్లు , సీసీ కెమెరాల ఏర్పాటు , ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు , అత్యవసర సేవల పై * నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.,* అధ్యక్షతన పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ యందు బుధవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు – 2027 అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక మహోత్సవమని , లక్షలాది మంది భక్తులు కమిషనరేట్ పరిధిలోని పుష్కర ఘాట్లకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రతి అంశాన్ని ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఘాట్‌కు ప్రత్యేక బందోబస్తు ప్రణాళిక రూపొందించి , రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో పోలీసు అధికారులు సిబ్బందిని నియమించాలని సూచించారు.పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రవేశ , నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు , క్యూ లైన్లు , బ్యారికేడ్లు , హెచ్చరిక బోర్డులు , దిశా నిర్దేశక సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు , దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాహనాల రద్దీని నియంత్రిం చేందుకు ఘాట్లకు దూరంగా తగిన పార్కింగ్ స్థలాలను గుర్తించి , అక్కడి నుంచి షటిల్ వాహనాల ద్వారా భక్తులను ఘాట్లకు తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసి , ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు , సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పుష్కర ఘాట్లు , పార్కింగ్ ప్రదేశాలు , ప్రధాన కూడళ్లు , రహదారులు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి , వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేసి 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. అవసరమైన చోట డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టి జనసమ్మర్థాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ , డిజిటల్ డిస్ప్లే బోర్డులు , హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని , తప్పిపోయిన చిన్నారులు , వృద్ధుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ , అగ్నిమాపక శాఖ , రెవెన్యూ , మున్సిపల్ , విద్యుత్ , ఆర్టీసీ , నీటిపారుదల , విపత్తు నిర్వహణ తదితర శాఖలతో సమన్వయం పెంచి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.ప్రతి పుష్కర ఘాట్ వద్ద తాగునీరు , విద్యుత్ , లైటింగ్ , పారిశుద్ధ్యం , తాత్కాలిక మరుగుదొడ్లు , తగినంత వెలుతురు , అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో పుకార్లు , తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని , అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ప్రతి ఒక్కరు తమ పరిధిలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించగా , పోలీస్ కమిషనర్ వాటిని సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. పుష్కరాలకు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి , భక్తులకు సురక్షితమైన , ప్రశాంతమైన , సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించే దిశగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) ఎన్. శుభం ప్రకాష్ , నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ ఎ.సి.పి లు ప్రకాష్ యాదవ్ , వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు శ్రీధర్ రెడ్డి , మలేష్ , గోదావరి పరివాహక ప్రాంతంలోని సి.ఐ లు , ఎస్.ఐ లు , ఐ.టి కోర్ , కమ్యూనికేషన్సి సిబ్బంది , పోలీస్ కార్యాలయం సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.