రైతన్నకు విజ్ఞానమే పెట్టుబడి

September 10, 2026 | తెలంగాణ

ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు


పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) రైతు విజ్ఞాన యాత్రను ప్రారంభించిన కూటమి పార్టీ సీనియర్ నేత వాసంశెట్టి సత్యంవ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు నిరంతరం కొత్త పద్ధతులను తెలుసుకోవాలని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు. రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించి, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు విజ్ఞాన యాత్ర’ ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కే.గంగవరం మరియు రామచంద్రపురం మండలాలకు చెందిన 50 మంది రైతులతో నిర్వహించిన ఈ రైతు విజ్ఞాన యాత్రను వాసంశెట్టి సత్యం, మార్కెట్ యార్డ్ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, నియోజకవర్గ రైతు అధ్యక్షులు బలుసు శివ ప్రసాద్ చౌదరి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవచ్చన్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖలు రైతులకు అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలు, విజ్ఞాన యాత్రలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ఈ యాత్రలో భాగంగా రైతులు సామర్లకోటలోని జీవన ఎరువుల తయారీ కేంద్రం, భూసార పరీక్ష కేంద్రం, విత్తనాభివృద్ధి అనుసరణాత్మక పరిశోధన కేంద్రాలను సందర్శించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం, పురుగుమందుల నివారణ చర్యలపై అవగాహన పెంపొందించుకున్నారు. ఎస్‌ఎం & ఏఆర్ వ్యవసాయ అధికారి బి. జ్యోతి వరి పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు మార్గదర్శనం చేశారు. భూసార పరీక్ష కేంద్రం సహాయ సంచాలకులు మాధవి, వ్యవసాయ అధికారి విజయ్ మట్టి నమూనాల సేకరణ విధానం, భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం జీవన ఎరువుల తయారీ కేంద్రాన్ని సందర్శించిన రైతులకు అక్కడ తయారయ్యే పీఎస్‌బీ, అజోస్పిరిల్లమ్, పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా ఉపయోగాలను వ్యవసాయ అధికారి పద్మ వివరించారు.రైతులు పరిశోధనా కేంద్రాల్లో నిపుణులతో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు, ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై విలువైన సమాచారం పొందారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మండల వ్యవసాయ అధికారులు, వీఏఏలు జగదీశ్, గణేష్, శ్రీరామ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper