రైస్ మిల్లుల్లో అక్రమాలపై విచారణ జరపాలిసబ్ కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతిపత్రం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:ముధోల్ నియోజకవర్గం పరిధిలోని భైంసా రెవెన్యూ డివిజన్లో ఉన్న పలు రైస్ మిల్లుల్లో అక్రమాలు, అవినీతి జరుగుతున్నాయని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భైంసా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సిందే కపిల్, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సూత్రావే ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి అక్రమంగా లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన డిఫాల్టర్ రైస్ మిల్లులకు కూడా ధాన్యం కేటాయింపులు జరుగుతున్నాయని, ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు గోదాములను తనిఖీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. రాజకీయ నాయకుల అండదండలతో కొందరు మిల్లర్లు బెనామీ వ్యక్తుల పేర్లపై అనుమతులు పొంది కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి,అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లుల అనుమతులను వెంటనే రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.