సాహితీ గోదావరి పోటీలో కాట్రేనికోన ఉపాధ్యాయుడికి ద్వితీయ స్థానం
పయనించే సూర్యుడు జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సాహితీ గోదావరి సాహితీ సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాహిత్య పోటీల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన ఉపాధ్యాయుడు, కవి చింతా రాంబాబు ప్రతిభ కనబరిచారు.ఆయన రచించిన “ఊటబావులు” అనే కవిత ద్వితీయ స్థానం సాధించి 1016 రూపాయల నగదు బహుమతిని దక్కించుకుంది. గ్రామీణ జీవన విధానం, ప్రకృతి అందాలు, రైతు జీవితంలోని కష్టాలను సున్నితంగా ఆవిష్కరించిన ఈ కవిత న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుంది.ఈరోజు కాకినాడ అచ్యుతాపురంలో ఘనంగా జరిగిన సాహితీ గోదావరి ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో విజేతలకు సన్మానం చేశారు. కవిత, కథ, వ్యాస రచన పోటీల్లో ప్రతిభ చూపిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీవేత్తలను జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.సభకు ముఖ్య అతిథులుగా హాజరైన సాహితీ గోదావరి వ్యవస్థాపకులు ర్యాలి శ్రీనివాస్, ప్రముఖ కథా రచయిత భమిడిపాటి గౌరీశంకర్, దుబ్బ శ్రీరామమూర్తి, చాగంటి సుబ్రహ్మణ్యం, ఆర్ వి వి రాజా, గరగ రామకృష్ణ తదితరులు విజేతలను అభినందించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధికి సాహితీ గోదావరి సంస్థ చేస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. యువతలో సాహిత్యాభిలాష పెంచేందుకు ఇలాంటి పోటీలు నిరంతరం జరగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే సాహిత్య రంగంలో కూడా చింతా రాంబాబు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంతకు ముందు కూడా జిల్లా, రాష్ట్ర స్థాయి కవితా పోటీల్లో పలు బహుమతులు సాధించారు. ఆయన విజయంపై కాట్రేనికోన ప్రాంత సాహితీ ప్రియులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.