డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలే కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకం బండి రమేష్
పయనించే సూర్యుడు న్యూస్ జులై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని గాయత్రి నగర్ మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో, అల్లాపూర్ వాజిద్ పాషా ఆధ్వర్యంలో, కెపిహెచ్బి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రశాంత్ నగర్ నాగార్జున మరియు రమణ ఆధ్వర్యంలో, ఆంజనేయ నగర్ లో శంకర్ ఆధ్వర్యంలో ఆంప్రాంతాల్లో నిర్వహించిన జయంతి కార్యక్రమాలకు టి.పి.సి.సి. వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై డా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించి కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ గృహాలు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ద్వారా డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడిగా నిలిచారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని అన్నారు.రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, మహానేత చూపిన బాటలోనే ప్రజాసేవ కొనసాగిస్తామని బండి రమేష్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు అర్పించారు.