
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచన సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయకముందే, తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత యోచిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీతో అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ అనంతరం తన ముఖ్య అనుచరులతో విస్తృతంగా చర్చలు జరిపిన కవిత, ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇంతటితో ఆగకుండా, త్వరలోనే సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే యోచనలో కవిత ఉన్నట్లు ఆమె అనుచరులు బలంగా చెబుతున్నారు. దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ఆమె రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కవిత ఎలాంటి ప్రకటన చేయనున్నారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.