ఢిల్లీ లో విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా
ధర్నా లో పాల్గొన్న షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూలై 23 షాద్‌నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఢిల్లీలో ‘నీట్’ పరీక్షల వివాదం, విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జీ, అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) పిలుపు మేరకు నేడు హైదరాబాద్‌లో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ శ్రీ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఢిల్లీలో ‘నీట్’ పరీక్షల అంశం, విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్ట డించేందుకు ప్రయత్నించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనలను ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ, విద్యార్థులపై బలప్రయోగం చేయడం, ప్రతిపక్ష నాయకులను అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.