రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన – చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడి
పయనించే సూర్యుడు న్యూస్ :Chittoor: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. కుర్మానిపల్లి గ్రామానికి చెందిన కిట్టప్ప అనే రైతును ఏనుగులు దాడి చేసి చంపేశాయి. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కిట్టప్ప తన రాగి పంటకు కాపలాగా రాత్రి పొలానికి వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు పొలంలోకి దిగి పంటను నాశనం చేస్తున్నాయని వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. దీంతో ఏనుగులు ఎదురు తిరిగి రైతు కిట్టప్పపై దాడి చేశాయి. ఈ దాడిలో కిట్టప్పకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే రైతు ఉంటున్న గుడిసెను కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. స్థానికులు ఘటనా స్థలికి చేరుకునే సరికి కిట్టప్ప అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుప్పం అటవీ శాఖ అధికారి జయశంకర్, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనతో కుర్మానిపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొంది. ఏనుగుల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అడవి జంతువుల నుంచి పంట పొలాలను, ప్రజలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగల దాడిలో రైతు మృతి చెందటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు వల్ల ఈ ఘటన జరిగిందన్నారు.