ఆర్‌జీయూకేటీ- త్రిబుల్ ఐటీ బాసర సెంట్రల్ లైబ్రరీలో ఘనంగా జాతీయ గ్రంథాలయ అధికారుల దినోత్సవం.

August 12, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :ఆర్‌జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర సెంట్రల్ లైబ్రరీలో జాతీయ గ్రంథాలయ అధికారుల దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్. ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్, ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఇ. మురళీదర్శన్ ముఖ్య అతిథులుగా హాజరై, డాక్టర్ ఎస్. ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.సమావేశంలో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ మాట్లాడుతూ గ్రంథాలయాల విశిష్టతను, విద్యార్థుల సమగ్ర వికాసంలో పఠనానుభవం పాత్రను వివరించారు. ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఇ. మురళీధర్శన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వారు పుస్తకాల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ, నిరంతర అభ్యసనానికి, పరిశోధనలకు గ్రంథాలయాలు కేంద్రబిందువులని పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రంథాలయానికి పుస్తకాలను విరాళంగా అందించిన విద్యార్థులతో పాటు, రోజూ లైబ్రరీని సందర్శిస్తూ ఇక్కడి వనరులను విస్తృతంగా వినియోగించుకుంటున్న విద్యార్థులకు అభినందనపూర్వకంగా బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థుల్లో పుస్తక పఠనాభిరుచిని పెంపొందించడం, గ్రంథాలయ వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ బహుమతుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.లైబ్రరీ ఇన్‌చార్జి డాక్టర్ కె. అరుణజ్యోతి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, టెక్నికల్ అసిస్టెంట్లు అర్చన, సునీతతో పాటు ఇతర గ్రంథాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper