అలుపెరుగని పోరాట యోధుడు శ్రీ భగీరథ మహర్షి
షాద్నగర్లో ఘనంగా భగీరథ జయంతి వేడుకలు
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కార్యదక్షత, కఠోర దీక్ష, సడలని ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహనీయుడు శ్రీ సగర భగీరథ మహర్షి అని సగర సంఘం నాయకులు కొనియాడారు. గురువారం షాద్నగర్ పట్టణంలోని 6వ వార్డు హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలను సగర సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి నారాయణ రావు వేద మంత్రుచ్చరణలతో మహర్షి చిత్రపటానికి పూజలు నిర్వహించిన అనంతరం పలువురు మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ… నేటి తరానికి స్ఫూర్తిదాత కృతయుగం నుండి నేటి కలియుగం వరకు కార్యసాధకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిన భగీరథ మహర్షి, యావత్ సగర జాతికి కుల గురువు కావడం మనందరి అదృష్టమని అన్నారు. గంగను ధరణికి తెచ్చేందుకు ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి యువతకు ఒక గొప్ప పాఠం అన్నారు. ఆ పట్టుదలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని వారు పేర్కొన్నారు.ఐక్యతతోనే అభివృద్ధి మహర్షి ఆశయాలకు అనుగుణంగా సగర బిడ్డలందరూ విద్యా, ఆర్థిక రంగాల్లో రాణించాలని, మనమందరం ఐక్యంగా ఉండి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. అప్పుడే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ప్రభుత్వాలు కూడా సగర కులస్తుల సంక్షేమానికి మరిన్ని నిధులు కేటాయించి, రాజకీయంగా గుర్తింపునివ్వాలన్నారు. ప్రతి ఏటా భగీరథ మహర్షి జయంతిని కేవలం ఒక ఉత్సవంగానే కాకుండా, సేవా కార్యక్రమాలకు వేదికగా మార్చుకోవాలన్నారు. పేద విద్యార్థులకు తోడ్పాటునందించడం, సామాజిక చైతన్యం కల్పించడం మన బాధ్యత అన్నారు. ‘భగీరథ మహర్షి అమర్ రహే’ అంటూ చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమంలో సగర సంఘం ముఖ్య నాయకులు మల్లేష్ సాగర్, కృష్ణ సాగర్, చందు సాగర్, సురేష్ సాగర్, శ్రవణ్ సాగర్, ఏకనాథ్ సాగర్, అభిషేక్ సాగర్, స్వామి సాగర్, వెంకట్ దాస్ సాగర్, బాస రాజేందర్, పెద్ద సంఖ్యలో సగర కుల బాంధవులు పాల్గొన్నారు.