ఘనంగా‘ప్రగతి పోషణ మహోత్సవం’
35 మంది గర్భిణులకు సీమంతం, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం
ముఖ్య అతిథులుగా హాజరైన డా. ఆలొక్ అగర్వాల్, సీతా దయాకర్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రగతి వెల్ఫేర్ సొసైటీ చేపట్టిన ‘ప్రగతి పోషణ మహోత్సవం’ ఉమ్మడి బుర్గుల గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రగతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఆలొక్ అగర్వాల్ విశిష్ట అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీజీఎస్సీపీసీఆర్ సభ్యులు సీతా దయాకర్ రెడ్డి, జిల్లా మహిళా అభివృద్ధి అధికారి శ్రీలత మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామానికి చెందిన 35 మంది గర్భిణీ స్త్రీలకు సొసైటీ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించి, వారికి పండ్లు, పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. అలాగే 35 మంది చిన్నారులకు అన్నప్రాశన, 50 మంది పిల్లలకు విద్యాభ్యాసం ప్రారంభోత్సవంగా అక్షరాభ్యాసం చేయించారు.0-6 సంవత్సరాల పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూడాలని, అంగన్వాడీ సేవలపై అవగాహన పెంచుకోవాలని వక్తలు సూచించారు. జీరో మాల్న్యూట్రిషన్ హెడ్ డ్యాగ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కమిషన్ సభ్యులు ప్రేమలత అగర్వాల్, బండి అపర్ణ, వచన్ కుమార్, మాజీ సీడీపీవో షబ్నం, ప్రస్తుత సీడీపీవో ఉదయ, సర్పంచ్ రాజా గోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు స్వప్న, వీరబద్రప్ప, జంగయ్య, డీఆర్డీఓ ఏపీవో అరుణ, యునైటెడ్ వే హైదరాబాద్ ప్రతినిధులు, ఆశా వర్కర్లు మరియు ఆంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన కోఆర్డినేటర్ లావణ్య, మురళీ కృష్ణ, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.
