ఓటరు జాబితాలో పేర్లు తొలగించకుండా చూడాలి
: పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 మక్తల్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు తగిన ఆధారాలు సంబంధిత అధికారులకు అందజేసి తమ ఓట్లు రద్దు కాకుండా చూసుకోవాలని, ఈ విషయంలో సంబంధిత అధికారులు ప్రజలకు పూర్తి సహకారం అందజేసి ఓట్లు తొలగిపోకుండా చూడాలని బిజెపి మక్తల్ నియోజకవర్గ బిఎల్ఎ -1 జి.బలరాం రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కర్ని స్వామి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 170 వ పోలింగ్ బూత్ పరిధిలో బుధవారం ఎస్ ఐ ఆర్ ప్రక్రియను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ పరిధిలో ముసాయిదా జాబితాలో 672 మంది ఓటర్లు ఉండగా, వారిలో 280 మందికి అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. దీనిపై ఓటర్లకు ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించడంతో 70 మంది తగిన ఆధారాలు చూపించడం జరిగిందన్నారు. మిగతా ఓటర్లు కూడా తగిన ఆధారాలను సంబంధిత అధికారులకు అందజేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆర్ఐ విజయ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీదేవి, బి ఎల్ ఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.