అశ్వాపురం లో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా – గ్రామసభ

September 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 17,అశ్వాపురం: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బానోత్ సదర్ లాల్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజలకు అందుతున్న సేవలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవ – స్వచ్ఛ 2026–27 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామసభలో ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న వివిధ పారిశుధ్య పనులు, రోజువారీ కార్యక్రమాలు, గ్రామసభల నిర్వహణ తదితర వివరాలను ప్రజలకు వివరించారు.అదేవిధంగా గత రెండు నెలల కాలంలో గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి చేసిన ఖర్చుల వివరాలను గ్రామసభలో సభ్యులకు, ప్రజలకు తెలియజేశారు.గత రెండు నెలల్లో గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి వీధిని శుభ్రపరచడం, కాలువలను పునరుద్ధరించడం, గ్రామ పారిశుధ్య నిర్వహణ కోసం నూతన ట్రాక్టర్‌ను కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.అలాగే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సీసీ రోడ్ల వద్ద కల్వర్టుల నిర్మాణం, మట్టి రోడ్లలో బురద ఉన్న ప్రాంతాల్లో వెట్ మిక్స్ వేయడం ద్వారా రోడ్లను మెరుగుపరచడం జరిగిందని వివరించారు.గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అశ్వాపురం గ్రామపంచాయతీని మరింత అభివృద్ధి చేసి, పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుల్లూరి ప్రకాశరావు, పంచాయతీ సెక్రటరీ యాకుబ్, వార్డు సభ్యులు నూకల లింగయ్య, చిక్కా పద్మ, వేములపల్లి హసిత, జరుపుల కౌసల్య, పాయం నాగేంద్రబాబు, చెట్టుపల్లి రామాదేవి, కోర్స ముత్తమ్మ, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper