తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయండి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్
( పయనించే సూర్యుడు మే 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) జూన్ 13, 14 తేదీలలో షాద్నగర్‌లో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరు జగన్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశం డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ మాట్లాడుతూ జిల్లాలో రియల్ ఎస్టేట్ పేరుతో పేదల భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు దున్నుతున్న భూములకు హక్కులు కల్పించాలని, ఇల్లు లేని పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల నిత్యావసర వస్తువులను చౌక దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రజలపై భారాలు మోపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కనీస అవసరాలు తీర్చే దిశగా పనిచేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, దున్నేవానికి భూమి ఇవ్వాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఆసరా, వితంతు, వికలాంగుల పెన్షన్లు పెంచాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి కార్మికుల కోసం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరగా పనిచేయడానికి ఈ జిల్లా మహాసభలను షాద్నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నామని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య, ఉపాధ్యక్షులు సిహెచ్ జంగయ్య, కాకి రమేష్, సహాయ కార్యదర్శులు కుమార్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.