అశ్వాపురం గ్రామ పంచాయతీ లో ముమ్మరంగా పెన్షన్ల ఆధార్ అనుసంధానం మరియు నూతన ప్రజా మరుగుదొడ్ల ప్రారంభం

May 23, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు,అశ్వాపురం, మే 23:అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయం శనివారం నాడు రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికైంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. మండలంలోని పలు గ్రామ పంచాయతీల కార్యదర్శుల సమన్వయంతో అశ్వాపురం గ్రామపంచాయతీ లో చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఇక్కడి సిబ్బందికి పూర్తి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో గొందిగుడెం పంచాయతీ సెక్రెటరీ మధుసూదన్ రావు, జగ్గారం సెక్రెటరీ బచ్చు రాజేంద్ర ప్రసాద్, నెల్లిపాక కార్యదర్శి వెంకటేశ్వర్లు, సంద్రలబోడు కార్యదర్శి అన్నమల్ల రమేష్, అమెర్ధ కార్యదర్శి సైదులు, తూర్రంవారిగూడెం కార్యదర్శి ప్రతాప్ తదితరులు పాల్గొని బయోమెట్రిక్ ప్రక్రియను పర్యవేక్షించారు.*నూతన ప్రజా మరుగుదొడ్ల ప్రారంభోత్సవం*అశ్వాపురం గ్రామపంచాయతీ మార్కెట్ ప్రాంతంలో ప్రజల, వ్యాపారుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్ళూరి ప్రకాష్ రావు గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మార్కెట్‌కు వచ్చే ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందని, ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఉన్న ప్రజలకు, వ్యాపారులకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాల్లో అశ్వాపురం పంచాయతీ కార్యదర్శి కందిమళ్ళ శ్రీకాంత్, వార్డు సభ్యులు ముత్తమ్మ, చిక్కా పద్మ, నూకల లింగయ్య,జర్పుల కౌసల్య,కూరగాయల మార్కెట్ యజమానులు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper