ఆక్వాలో సిండికేట్ వ్య‌వ‌స్థ‌ను రూపుమాపాలంటూ ఆక్వారైతుల నిర‌స‌న‌..

May 23, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు మే 23 ముమ్మిడివరం ప్రతినిధిఅమ‌లాపురం ఎమ్మెల్యేకు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించిన ఆక్వా రైతులు..ఆక్వా రైతులు వ‌రుస న‌ష్టాల‌తో తీవ్ర స‌త‌మ‌త‌మ‌వుతున్నా ఎక్స్ పోర్ట‌ర్లు, మేత‌ల కంపెనీల య‌జ‌మానులు ఒక సిండికేట్‌గా మారి ఆక్వా రంగాన్ని అధ‌పాతాళానికి తొక్కేస్తున్నార‌ని ఆక్వా రైతులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.. అమ‌లాపురంలో రాష్ట్ర క్ష‌త్రియ కార్పోరేష‌న్ డైరెక్ట‌ర్, ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్య‌క్షుడు దెందుకూరి స‌త్తిబాబు రాజు ఆధ్వ‌ర్యంలో రైతులు రొయ్య‌ల ధ‌ర‌లు త‌గ్గింపుపై తీవ్ర నిర‌స‌న తెలిపారు. మొన్న‌టి వ‌ర‌కు రొయ్య‌ల మేత‌ల ధ‌ర‌లు భారీగా పెంచి ఆక్వా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేశార‌ని, దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవ్వ‌డంతో మేత‌ల ధ‌ర‌లు త‌గ్గించి ఇప్పుడు మ‌ళ్లీ రొయ్య‌ల ధ‌ర‌లు త‌గ్గించేశార‌ని మండిప‌డ్డారు. దేశానికి అత్య‌ధిక ఆదాయాన్ని తీసుకువ‌చ్చే డాల‌ర్ల పంట ను ఓ ప‌క్క ఎక్స్ పోర్ట‌ర్లు, మ‌రో ప‌క్క మేత‌ల కంపెనీలు నిలువునా మోసం, ద‌గా చేస్తున్నాయ‌ని, ఈ రెండు వ్య‌వ‌స్థ‌లు సిండికేట్‌గా మారి ఆక్వా రంగాన్నిన‌మ్ముకున్న రైతుల‌ను నిలువునా ద‌గా చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. స‌త్తిబాబు రాజు మాట్లాడుతూ ఆక్వా రంగంలో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌, సిండికేట్ వ్య‌వ‌స్థ‌ను రూపుమాపాల‌ని అన్నారు. ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని సిండికేట్ వ్య‌వ‌స్థ‌పై నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టి రొయ్య‌ల ధ‌ర‌లు పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. మ‌రో ఆక్వా రైతు నాయ‌కుడు త్స‌వ‌ట‌ప‌ల్లి నాగ‌భూష‌ణం మాట్లాడుతూ ఆక్వా రంగం వెంటిలేట‌ర్ పై ఉంద‌ని, ఓ ప‌క్క మేత‌ల ధ‌ర‌లు పెంచి ఆపై రైతులు ఉద్యమ బాట ప‌డితే ధ‌ర‌లు త‌గ్గించిన‌ట్లే త‌గ్గించి ఇప్పుడు రొయ్య‌ల ధ‌ర‌లు త‌గ్గించేశార‌ని, అంత‌ర్జాతీయ మార్కెట్లో ఎటువంటి వ్య‌త్యాసాలు లేక‌పోయినా ధ‌ర‌లు త‌గ్గించ‌డం దారుణ‌ మ‌న్నారు. అనంత‌రం అమ‌లాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్భార్‌కు ర్యాలీగా వ‌చ్చి విన‌తి ప‌త్రాన్ని ఎమ్మెల్యే ఆనంద‌రావుకు స‌మ‌ర్పించారు. ఎమ్మెల్యే ఆనంద‌రావు మాట్లాడుతూ ఆక్వా రంగాన్ని వైసీపీ ప్ర‌భుత్వం న‌ష్టాల ఊబిలోకి నెట్టింద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఆక్వా ప‌రిశ్ర‌మ‌కు జ‌వ‌స‌త్వాలు ఇచ్చింద‌న్నారు. ప్ర‌స్తుతం మేత‌ల ధ‌ర‌ల పెంపు పై కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చొర‌వ తీసుకుని ధ‌ర‌లు త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకున్నార‌ని, ఇప్ప‌డు రొయ్య‌ల ధ‌ర‌లు త‌గ్గించ‌డంపై కూడా కూట‌మి ప్ర‌భుత్వం ఎక్స్ పోర్ట‌ర్స్‌తో చ‌ర్చించి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసి ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అల్లూరి ర‌మేష్ రాజు, దెందుకూరి దుర్గ‌రాజు, వేగిరాజు వెంక‌ట‌రాజు, స‌త్తి శ్రీ‌ను, వాసు రాజు, మోటూరి కిర‌ణ్, అధికారి బాబ్జి త‌దిత‌రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper