గోవులను రక్షించడం సమాజ బాధ్యత – సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి
బక్రీద్ పండుగను సామరస్యంతో జరుపుకోవాలి: సూచన
పయనించే సూర్యుడు న్యూస్ మే 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లోని కాన్ఫిడెన్స్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ రెడ్డి పాల్గొని గోవుల సంరక్షణ, సామాజిక ఐక్యత ప్రాధాన్యతపై కీలక సందేశం అందించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గోవులను భక్తితో పూజించడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. అలాగే బక్రీద్ పండుగను శాంతియుతంగా, పరస్పర గౌరవభావంతో, ఐక్యతతో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ కూకట్పల్లి ప్రాంతంలో గోవుల సంరక్షణ విషయంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని కొనియాడారు. గోవులను రక్షించేందుకు కూకట్పల్లి పోలీస్ సిబ్బంది తమ వంతు కృషిని సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో గోశాలల నిర్వహణకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గోవుల సంరక్షణకు అవసరమైన విశాలమైన ప్రదేశాలు, తాగునీరు, గడ్డి, పశుగ్రాసం వంటి మౌలిక వసతులు కొరతగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి పట్టణ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు పల్లె ప్రాంతాల్లో గోశాలల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే ఈ వేదికను కల్పించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్, బాలనగర్ డీసీపీ, కూకట్పల్లి ఏసీపీ, కూకట్పల్లి సీఐతో పాటు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, యశ్వంత్, లక్ష్మీనారాయణ, జి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.