*ప్రగతి వెల్ఫేర్ సొసైటీ మరియు స్టూడెంట్ ఫోర్స్ ఆధ్వర్యంలో పంపిణీ *

( పయనించే సూర్యుడు నవంబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ప్రగతి వెల్ఫేర్ సొసైటీ మరియు స్టూడెంట్ ఫోర్స్ సంయుక్త సహకారంతో గురువారం బూర్గుల ప్రాథమిక పాఠశాలలో 94 మంది విద్యార్థులకు సుమారు 400 నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు.వీటిని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు గత సంవత్సరం ఉపయోగించిన రికార్డు పేపర్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేశారు. ఈ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు స్టూడెంట్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, గత 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు వేలాది నోట్‌బుక్‌లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందిస్తూ తమ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్‌ల పునర్వినియోగం, పుస్తకాల విలువ, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఉపయోగించిన కాగితాలను రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించడం ద్వారా సహజ వనరులను ఆదా చేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రీతి బాల మాట్లాడుతూ, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు గత 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని, వారి నిబద్ధతను మరియు కృషిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళీకృష్ణ, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ మేనేజర్ శంకర్, ఎడ్యుకేషన్ మేనేజర్ జగదీష్, జ్యోతి, తుల్జారం, లావణ్య, విలేజ్ ఛాంపియన్లు, ఆఫ్టర్ స్కూల్ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.