
పయనించే సూర్యుడుD.13.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. శ్రమజీవులకు రాజ్యాధికారం సాధించడమే కమ్యూనిజం లక్ష్యం– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రాంచందర్, కె. రమసిరికొండ, నవంబర్ 13:వర్గపోరాటాలను తీవ్రతరం చేయడం, శ్రమజీవులను సంఘటితం చేసి దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం ఉద్యమాల ను బలోపేతం చేయడమే కమ్యూనిస్టుల ప్రధాన కర్తవ్యమని, శ్రమజీవులకు రాజ్యాధికారం సాధించడమే కమ్యూనిజం అంతిమ లక్ష్యమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రాంచందర్, కె. రమ అన్నారు.సిరికొండ మండల కేంద్రంలోని అమరుడు కామ్రేడ్ కర్ణాటి యాదగిరి మీటింగ్ హాల్లో శుక్రవారం జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ అధ్యక్షతన సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్–కామారెడ్డి సంయుక్త జిల్లా ప్లీనమ్ నిర్వహించారు. ఈ ప్లీనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేజీ రాంచందర్, కె. రమ మాట్లాడుతూ ప్రపంచ కార్మికవర్గ విముక్తి కోసం కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ తమ జీవితాలను అంకితం చేసి కమ్యూనిస్టు ప్రణాళికను ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు. శ్రమజీవులంతా సంఘటితమై దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారని గుర్తుచేశారు. భారత దేశంలో ఇప్పటికీ విప్లవం సాధ్యం కాకపోవడానికి సరైన విప్లవ పంథాను అనుసరించకపోవడం కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు. అందుకే తమ పార్టీ భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంథాను రూపొందించు కొని ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఈ పరిస్థితులను శ్రమజీవుల విముక్తి ఉద్యమాలకు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో బలమైన విప్లవోద్యమ నిర్మాణానికి కమ్యూనిస్టులు కృషి చేయాలని, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ఇతర కష్టజీవులను ఐక్యం చేసి శ్రమజీవుల రాజ్యాధికార స్థాపన దిశగా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, జిల్లా నాయకులు బి. దేవరాం, ఆర్. రమేష్‌లు కూడా ప్రసంగిస్తూ పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాల విస్తరణ, వర్గపోరాటాల బలోపేతం తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ ప్లీనంలో జిల్లా నాయకులు ఎం. ముత్తెన్న, ఎస్. సురేష్, కె. రాజేశ్వర్, వి. సత్తెవ్వ, సురేష్, జి. కిషన్, వి. ప్రకాష్, డివిజన్ నాయకులు బి. బాబన్న, ఆర్. దామోదర్, బి. కిషన్, ఎం. నరేందర్, ఎం. సాయిరెడ్డి, పి. రమ, ఎ. అశోక్, బి. కిశోర్, యు. రాజన్న, ఆకుల గంగారాం, మండల నాయకులు ఎం. లింబాద్రి, ఎస్. కిశోర్, ఎం.డి. అనీష్, ఆర్. పుష్పలత, ఎం. నారగౌడ్, జె. బాల్ రెడ్డి, కె. ఆసిస్, పీడీఎస్‌యూ డివిజన్ అధ్యక్షులు నిఖిల్, డివిజన్ నాయకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.