పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి హుడా ట్రక్ పార్క్ భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, కూకట్పల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన నిరసన దీక్షలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ నిరసన దీక్షలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా (అర్బన్) అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రజా అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలని, వాటిని వేలం వేయడం తగదని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భూముల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం, పార్కులు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం సేకరించిన భూములు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడాల్సిన విలువైన భూములను వేలం ద్వారా ఇతర ప్రయోజనాలకు మళ్లించకుండా, స్థానిక ప్రజల సంక్షేమం మరియు ప్రాంత అభివృద్ధికి వినియోగించాలని, హుడా ట్రక్ పార్క్ భూముల పరిరక్షణ కోసం బీజేపీ చేపట్టిన ఈ పోరాటం ప్రజల హక్కుల కోసం, కూకట్పల్లి ప్రాంత భవిష్యత్తు కోసం కొనసాగుతుందని,భూముల వేలాన్ని నిలిపివేసి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శేఖర్ యాదవ్, గాజులరామారం, మూసాపేట్ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, శేషగిరిరావు, కొడిచెర్ల మహేందర్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు తదితర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.అలాగే, కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ కుల సంఘాల ప్రతినిధులు, కాలనీల అధ్యక్షులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను కాపాడాలనే డిమాండ్‌కు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తమ నిరసనను తెలియజేశారు.