పయనించే సూర్యుడు నవంబర్ 23 నిర్మల్ జిల్లా బ్యూరో నెల రోజుల పాటు వివిధ పోలీస్ విభాగాల్లో ప్రాక్టికల్ శిక్షణ – పోలీసింగ్ విధానాలు, దర్యాప్తు, ప్రజాసేవపై ప్రత్యేక అవగాహన. పోలీస్ శాఖలో శిక్షణలో భాగంగా జిల్లా ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ఒక నెల రోజుల పాటు నిర్మల్ జిల్లాకు కేటాయించబడిన నలుగురు ట్రైనీ డీఎస్పీలు గజారే సంగీత, ధారావత్ చందన, పతి సందీప్ కుమార్, చట్టు భవాని ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారికి జిల్లాలో కేటాయించిన వివిధ ప్రాక్టికల్ ట్రైనింగ్ యూనిట్లు, ఆయా విభాగాల విధులు, బాధ్యతలు, పోలీస్ శాఖ పనితీరుపై వివరించారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అవగాహన పొందాలని సూచించారు. శిక్షణ సమయంలో కేవలం పరిశీలనకే పరిమితం కాకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, సీనియర్ అధికారుల అనుభవాలను తెలుసుకుంటూ విధి నిర్వహణలోని మెళకువలను నేర్చుకోవాలని సూచించారు. పోలీస్ విధుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే బాధ్యతాయుతమైన అధికారులుగా ఎదగాలని ట్రైనీ డీఎస్పీలకు జిల్లా ఎస్పీ సూచించారు. నిర్మల్ జిల్లాలో నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా ట్రైనీ డీఎస్పీలు పోలీస్ పరిపాలన, క్షేత్రస్థాయి విధులు, ప్రజాసేవలో అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు, ప్రత్యక్ష అనుభవాన్ని పొందనున్నారు.