కటాస్, కుమితే, వెపన్ విభాగాల్లో యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ క్రీడాకారుల ప్రతిభ విజేతలను ప్రత్యేకంగా అభినందించిన కరాటే మాస్టర్లు ( పయనించే సూర్యుడు నవంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో షాద్నగర్ పట్టణానికి చెందిన ‘యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్’ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. వివిధ విభాగాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించి పతకాలను కైవసం చేసుకున్నారు. జడ్చర్ల పట్టణంలోని బి.ఆర్.రెడ్డి గార్డెన్ వేదికగా ‘ఏ.ఆర్ స్పోర్ట్స్ అకాడమీ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఛాంపియన్షిప్ – 2026’ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఆర్గనైజర్ రవి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ పోటీల్లో షాద్నగర్ యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు వివిధ వయసుల కేటగిరీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా కటాస్, కుమితే, వెపన్ విభాగాల్లో తమ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో క్లబ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతలుగా నిలిచి షాద్నగర్ పట్టణానికి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించిన విద్యార్థులను కరాటే మాస్టర్లు సాయినాథ్ యాదవ్, గోపి నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. కఠోర సాధన, క్రమశిక్షణతోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ మరిన్ని పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంపై స్థానిక క్రీడాభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.