రాష్ట్ర ఆక్వా రైతుల కీలక సమావేశం
ఏ.పి ఆక్వా రైతు సంఘం అధ్యక్షునిగా గాంధీరాజు ఏకగ్రీవ ఎన్నిక
పయ నించే సూర్యుడు జూన్ 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతు సంఘాల ప్రతినిధుల సమక్షంలో కీలక రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా సంఘ అధ్యక్షులు దెందుకూరి సత్తిబాబు రాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతు నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో ఒక సమగ్ర రైతు వేదిక అవసరాన్ని గుర్తించి “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం నూతన సంఘాన్ని ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలుమార్లు చర్చలు జరిపిన నేపథ్యంలో ఇప్పటికే ఐదు సమావేశాలు నిర్వహించగా, అమలాపురంలో జరిగిన ఆరో సమావేశంలో రాష్ట్ర స్థాయి కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు నాయకులు వెల్లడించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజును ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన టి.నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన యశ్వంత్ కుమార్, జాయింట్ సెక్రటరీగా ఏలూరు జిల్లాకు చెందిన హరిహర రాజు, ఖజానాదారుగా కృష్ణా జిల్లాకు చెందిన మధులను ఎన్నుకున్నారు.ఇక గతంలో ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన భాస్కర్ రాజును సంఘ గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించారు. నియోజకవర్గాల వారీగా ఈసీ సభ్యుల ఎంపిక రాష్ట్ర కమిటీ విస్తరణలో భాగంగా పలు ప్రాంతాల నుంచి ఈసీ సభ్యులను కూడా ఎంపిక చేశారు. ఉండి నుంచి యువరాజు, గణపవరం నుంచి వినాయక్, ఏలూరు నుంచి నాని, నరసాపురం నుంచి తర్జా బుజ్జి, ఆచంట నుంచి శ్రీనివాసరాజు, పాలకొల్లు నుంచి జాన్ రాజు, కాకినాడ నుంచి సూర్యారావు, మురమళ్ల నుంచి పృథ్విరాజ్, అనకాపల్లి నుంచి రమేష్ రాజు, అమలాపురం నుంచి యాళ్ళవెంకటానందం, మలికిపురం నుంచి రామలింగరాజు, ప్రకాశం నుంచి సతీష్‌లను ఈసీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఇంకా రాష్ట్రంలోని ఇతర ఆక్వా ప్రాంతాల నుంచి కూడా సభ్యులను కమిటీలోకి తీసుకుంటామని నాయకులు తెలిపారు. అలాగే రైతు సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ నియామక డైరెక్టర్లు, ఆక్వా రంగానికి చెందిన కీలక వ్యక్తులను కూడా సంఘంలో భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు.సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీడ్ ధరలు భారీగా పెరగడం, రొయ్యల ధరలు తగ్గిపోవడం, నాణ్యమైన సీడ్ కొరత, ప్రభుత్వం హామీ ఇచ్చిన రూపాయి సబ్సిడీ ఇంకా అమలుకాకపోవడం వంటి అనేక సమస్యలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ఆక్వా రైతు సంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని భావించి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పోరాటం ఎవరిపైనా కాదని, నష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూపాయి విద్యుత్ సబ్సిడీని తక్షణమే అమలు చేయాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతి సంస్థలు రైతు సంఘంతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనాలని కోరింది.ఫిషరీస్ కమిషనర్, అప్సడా వైస్ చైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తదితర అధికారులను కలిసి రైతు సమస్యలను వివరించి పరిష్కారం కోరనున్నట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న ఆక్వా రైతు సంఘాలు, మండల స్థాయి సంఘాలు, రైతు నాయకులు అందరూ ఐక్యంగా ముందుకు వస్తే రైతుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులందరూ సంఘటితంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోనసీమలో రాష్ట్ర స్థాయి సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా రైతు నాయకులకు రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం ముగింపు సందర్భంగా రైతు నాయకులు “రైతుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఆక్వా రైతుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ త్సవటపల్లి మణికుమార్, రంగయ్య నాయుడు, సత్తినిడి నాని బోనం చినబాబు అల్లూరి రమేష్ రాజు , జాన్ రాజు తోపాటు అధిక సంఖ్యలో రైతసంగాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు